మహబూబాబాద్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని మనస్తాపానికి గురైన ఓ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఆవుల నరేశ్ ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్ మృతిచెందాడు. మృతునికి భార్య పూలమ్మ, కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నారు. భార్య గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమె మందులకు నెలకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతున్నాయనీ... మరోవైపు పిల్లల చదువుతో నరేశ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. నరేశ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహంతో ర్యాలీ.. ఉద్రిక్తం డ్రైవర్ నరేశ్ మృతదేహంతో కార్మికులు, నేతలు ర్యాలీ చేపట్టారు.. ఆస్పత్రి నుంచి బస్సు డిపో వరకు ర్యాలీ చేపట్టి అనంతరం డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డిపో ఎదుట వారు ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య